భీంగల్, ఆగస్టు 10: E6 tv NEWS (T. గంగాధర్)
దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక సంఘాల పిలుపులో భాగంగా భీంగల్ పట్టణంలో అంగన్వాడీ ఉద్యోగులు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కైరిదేవ గంగు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల గోవర్ధన్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం సరికాదన్నారు. లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉపాధి హామీ చట్టాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని కోరారు. పెరుగుతున్న ధరలను నియంత్రించాలని, విత్తన చట్టాన్ని సవరించాలని, రైతులు పండించే పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే కార్మిక, కర్షక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు జ్యోతి, ప్రమీల, లక్ష్మి, యమున తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


