Breaking News

ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం చూపాలి

ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

మండలాల్లోనూ ప్రజావాణి నిర్వహణతో ప్రజలకు చేరువగా పాలన

పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).
ప్రజల నుంచి స్వీకరించే ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.

సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాలు, ఉపాధి, పింఛన్లు, గృహాలు, మౌలిక వసతులు, సామాజిక భద్రత తదితర సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజావాణి కీలక వేదిక అని తెలిపారు. ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు.తక్షణమే పరిష్కరించగల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, క్లిష్టమైన సమస్యలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.

జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలోని ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమకు సమీపంలోని ఎంపీడీవో కార్యాలయంలోనే వినతులు సమర్పించి స్థానికంగా సమస్యలకు పరిష్కారం పొందాలని సూచించారు. వినతులతో పాటు సంబంధిత ఆధార పత్రాలను సమర్పిస్తే సమస్యల పరిష్కారం మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

ప్రజావాణిలో పలు వినతులు

దుమ్ముగూడెం మండలం పర్ణశాలకు చెందిన బానోతు భవిత గత ఆరేళ్లుగా పర్ణశాలలోని నార చీరల వద్ద కూల్‌డ్రింక్స్ షాపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల గోదావరి వరదలకు షాపు నీట మునిగిందని, తిరిగి షాపు ఏర్పాటు చేసుకునే సమయంలో తన స్థలంలో ఇతరులు షాపు ఏర్పాటు చేశారని, తహసీల్దార్‌కు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. తన షాపు స్థలాన్ని తిరిగి ఇప్పించాలని కోరగా, దరఖాస్తును పరిశీలించి చర్యలు తీసుకోవాలని భద్రాచలం సబ్‌కలెక్టర్‌కు ఎండార్స్ చేశారు.జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామ ప్రజలు ఆరేళ్లుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మురుగునీరు రోడ్లపై నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ సమస్యను పరిష్కరించాలని కోరారు. దరఖాస్తును పరిశీలించి చర్యలు తీసుకోవాలని జూలూరుపాడు ఎంపీడీవోకు ఎండార్స్ చేశారు.

మణుగూరు మండలం సమితిసింగారం గ్రామపంచాయతీకి చెందిన గుండి సౌజన్య అంగన్వాడీ టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకుని అర్హత సాధించానని తెలిపారు. తన అర్హతలను పరిశీలించి అంగన్వాడీ టీచర్ పోస్టు కేటాయించాలని కోరగా, దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు.

బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి చెందిన 65 గిరిజన కుటుంబాలు సుమారు 35 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నామని తెలిపారు. కాలనీలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల లేక పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రం లేదా ప్రాథమిక పాఠశాల మంజూరు చేయాలని కోరగా, దరఖాస్తును పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓకు ఎండార్స్ చేశారు.

ఇల్లందు మండలం సుదిమల్ల గ్రామానికి చెందిన ధనసరి పగిడిద్దరాజు సర్వే నంబర్ 617లో తనకు ఐదు ఎకరాల పట్టా భూమి ఉండగా, సింగరేణి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు కోసం రెండు ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. మిగిలిన మూడు ఎకరాలకు సంబంధించిన పాత రికార్డులను సవరించి, తన పేరుపై నూతన పట్టాదారు పాస్‌బుక్ జారీ చేయాలని కోరగా, దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత సెక్షన్ అధికారికి ఎండార్స్ చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *