బోధన్, జూలై 2: E6 న్యూస్
ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేసి, విద్యార్థుల ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీవీపీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బోధన్ ఆర్టీవోకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలే నాగేష్ మాట్లాడుతూ, బోధన్ పట్టణంలోని యూనిక్ హై స్కూల్‌కు చెందిన AP20TB6907 నంబర్ ప్రైవేట్ స్కూల్ బస్సు బండారుపల్లి–శ్రీనివాస్ క్యాంప్ మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో స్టీరింగ్ హ్యాండిల్ రాడ్ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పిందని తెలిపారు. రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొని బస్సు ఆగడంతో పెను ప్రమాదం తప్పిందని, లేకపోతే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని అన్నారు.
జిల్లాలో నడుస్తున్న అన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు, అవసరమైన అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని రవాణా శాఖ అధికారులు సమగ్రంగా తనిఖీ చేయాలని కోరారు. ఫిట్నెస్ లేని బస్సులను వెంటనే సీజ్ చేయడంతో పాటు, తగిన లైసెన్స్ లేని డ్రైవర్లతో బస్సులు నడిపే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ కార్యదర్శి నిఖిల్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

