Breaking News

జగిత్యాల కేంద్ర విద్యాలయానికి 10 ఎకరాల భూమి కేటాయించాలి: ఎంపీ ధర్మపురి అరవింద్.

జగిత్యాల, జూలై 3: E6 న్యూస్ (శివ ఠాకూర్)

జగిత్యాలలో ఏర్పాటు కానున్న కేంద్ర విద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం 5 ఎకరాల భూమి కేటాయించడం స్వాగతించదగ్గ నిర్ణయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. అయితే, కేంద్ర విద్యాలయ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూ కేటాయింపును 10 ఎకరాలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు వెల్లడించారు.

కేంద్ర విద్యాలయ సంఘం (కేవీఎస్) నిబంధనల ప్రకారం 5 ఎకరాలు కనీస అవసరమే అయినప్పటికీ, మెట్రో నగరాల వెలుపల ఏర్పాటు చేసే కేంద్ర విద్యాలయాలకు 10 ఎకరాల స్థలం అనువైన ప్రమాణమని ఎంపీ పేర్కొన్నారు. అదనపు భూమి ఉంటే విశాలమైన తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, భవిష్యత్తు విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం సులభమవుతుందని వివరించారు.

జగిత్యాల జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో గతంలోనే 10 ఎకరాల భూమి కేటాయించాలని కోరిన విషయాన్ని గుర్తు చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్, విద్యార్థుల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి భూ కేటాయింపును 10 ఎకరాలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *