నిజామాబాద్‌లో జోన్-2 పరిధి జిల్లా పోలీసు అధికారులతో తొలి సమీక్షా సమావేశం.
E6 -క్రైమ్ న్యూస్ (శివ ఠాకూర్).
శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బాసర జోన్-2 డీఐజీ ఆర్. భాస్కరన్, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు డీఐజీకి జిల్లా అధికారులు స్వాగతం పలకగా, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, మహిళలు–చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మాదకద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్ తదితర అంశాలపై విస్తృతంగా సమీక్షించారు.
జిల్లాల వారీగా నమోదవుతున్న నేరాలు, వాటి దర్యాప్తు పురోగతి, వారెంట్ల అమలు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పర్యవేక్షణపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రజల ఫిర్యాదులను సకాలంలో స్వీకరించి పారదర్శకంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను డీఐజీ ఆదేశించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సైబర్ నేరాలను అరికట్టాలని, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు యువతలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి, ప్రజలకు అందుబాటులో ఉండే స్నేహపూర్వక పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా పనిచేయాలని డీఐజీ ఆర్. భాస్కరన్ సూచించారు.
ఈ సమావేశంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, నిర్మల్ ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్‌తో పాటు అదనపు ఎస్పీలు, ఏసీపీలు, సీఐలు, రిజర్వ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

