గాడ్కోల్‌లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి ఘనంగా నిర్వహణ
సిరికొండ, జూలై 4: E6 న్యూస్ (శివ ఠాకూర్).
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై బలమైన ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపునిచ్చారు.
సిరికొండ మండలం గాడ్కోల్ గ్రామంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పి. రామకృష్ణ మాట్లాడుతూ, భూమి, భుక్తి, వెట్టిచాకిరీ నిర్మూలన కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమరయ్య ముందుండి పోరాడిన వీరయోధుడని కొనియాడారు. వేలాది మంది అమరుల త్యాగాలు, వేల గ్రామాల విముక్తి, లక్షల ఎకరాల భూ పంపిణీ వంటి చారిత్రక ఘట్టాలకు కమ్యూనిస్టు ఉద్యమం నాంది పలికిందని పేర్కొన్నారు.
దొడ్డి కొమరయ్య అమరత్వం రైతాంగ పోరాటాలకు మరింత స్ఫూర్తినిచ్చిందని, భూమి కోసం సాగిన పోరాటాల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రజలను చైతన్యపరిచిందని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కొందరు మత ఘర్షణలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
దొడ్డి కొమరయ్య ఆశయాలను కొనసాగించాలంటే ప్రజా సమస్యలపై బలమైన ఉద్యమాలు నిర్మించి, పోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమానికి సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ అధ్యక్షత వహించగా, డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, ఎం. సాయరెడ్డి, బి. బాబన్న, బి. కిశోర్, ఎం. అనీష్, మండల నాయకులు ఎస్. కిశోర్, జి. బాల్‌రెడ్డి, జి. ఎర్రన్న, ఓ. ఆశన్న తదితరులు పాల్గొన్నారు.

