బోధన్: E6 న్యూస్ (ఔరాద్ అశోక్). బోధన్ పట్టణంలో బీఆర్ఎస్వీ (BRSV), బీవీఎఫ్ (BVF), జీవీఎస్ (GVS) గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థి నేతలు వడ్ల సతీష్ చారి, జాదవ్ ప్రవీణ్ నాయక్, సిరివెసు సంతోష్ మాట్లాడుతూ, బోధన్‌లోని ప్రైవేట్ విద్యాసంస్థలు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ పట్టణాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాయని తెలిపారు.
అయితే కొందరు విద్యార్థి సంఘాల నాయకులు స్వప్రయోజనాల కోసం విద్యాసంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థి సంఘాలు విద్యార్థులు, యాజమాన్యాల మధ్య వారధిగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, సమస్యలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించరాదని సూచించారు.
విద్యాసంస్థలపై అనవసర ఆరోపణలు చేయడం వల్ల బోధన్‌కు ఇతర ప్రాంతాల నుంచి చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రైవేట్ విద్యాసంస్థలు, వాటిపై ఆధారపడిన ఉద్యోగులు, సిబ్బంది ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అన్ని విద్యార్థి సంఘాలు పనిచేయాలని, విద్యార్థుల హక్కుల పరిరక్షణతో పాటు విద్యాసంస్థల అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కొర్రా బంతిలాల్ నాయక్, ఆఫనాన్‌తో పాటు పలువురు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

