Breaking News

టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం.. ఈసీకి వారం రోజుల్లో సమాధానం.

  • నోటీసులకు బదులిచ్చిన తర్వాత వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
  • పార్టీ పేరుపై వచ్చిన అన్ని అభ్యంతరాల ప్రతులు ఇవ్వాలని టీఆర్ఎస్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి
  • ఈసీ ఎదుట కల్వకుంట్ల కవిత స్వయంగా హాజరై వివరణ ఇస్తారని పార్టీ వర్గాల వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్).

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం ఈసీ ఎదుట వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరగా, నోటీసులకు సమాధానం అందిన తర్వాత పార్టీకి హియరింగ్ నిర్వహించి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది.

పార్టీ పేరుపై అభ్యంతరాలు కోరుతూ ఈసీ సూచన మేరకు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని, తమకు పంపిన రెండు అభ్యంతరాలకు ఇప్పటికే సమాధానం ఇచ్చామని న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని చెబుతున్న ఈసీ, వాటి పూర్తి వివరాలను తమకు అందించలేదని పేర్కొన్నారు. తమ పార్టీ పేరుపై వచ్చిన అన్ని అభ్యంతరాల ప్రతులను ఇవ్వాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ, ముందుగా ఈసీ నోటీసులకు నిర్ణీత గడువులో సమాధానం ఇవ్వాలని సూచించారు. అనంతరం పార్టీకి వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.

టీఆర్ఎస్ వర్గాల స్పందన

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను స్వాగతించిన టీఆర్ఎస్ వర్గాలు, తొలుత “తెలంగాణ ప్రజా జాగృతి” పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్నామని, అనంతరం ఈసీ తమ దరఖాస్తులోని మూడో పేరు **”తెలంగాణ రక్షణ సేన”**ను పరిశీలనకు తీసుకుని అభ్యంతరాలు కోరిందని గుర్తు చేశాయి.

ఈసీ అనుమతితోనే తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండా గద్దెలు నిర్మించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నాయి. వారం రోజుల్లో నోటీసులకు సమాధానం ఇస్తామని, అనంతరం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఈసీ ఎదుట స్వయంగా హాజరై పార్టీ పేరుపై వివరణ ఇస్తారని వెల్లడించాయి.

ఇప్పటికే తెలంగాణలో TRS సంక్షిప్త నామంతో రెండు రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇచ్చిన ఈసీ, ఇప్పుడు తమ పార్టీ విషయంలో అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయో స్పష్టం చేయాలని పార్టీ వర్గాలు ప్రశ్నించాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చివరికి గెలిచేది న్యాయమేనని ధీమా వ్యక్తం చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *