బోగస్ ఓట్ల తొలగింపునకు ఇదే మంచి అవకాశం: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
భైంసా,E6 న్యూస్, తిరుపతి గౌడ్:
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, గ్రామాల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు. బోగస్ ఓట్ల తొలగింపునకు ఎస్‌ఐఆర్ ప్రక్రియ మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.
గురువారం భైంసా పట్టణంలోని ఎస్‌ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై బీజేపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో గ్రామాల వారీగా బీఎల్‌ఓలకు బీజేపీ బీఎల్‌ఏలు సహకరించాలని సూచించారు.
విదేశీయులు దేశంలో అక్రమంగా చొరబడి ఓటరు జాబితాల్లో చోటు పొందకుండా నిరోధించేందుకు, బోగస్ ఓట్లను గుర్తించి తొలగించేందుకు ఎస్‌ఐఆర్ దోహదపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. భైంసాతో పాటు కుబీర్, ముధోల్, తానూర్, బాసర మండలాల్లో పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఎస్‌ఐఆర్‌పై ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత బీజేపీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.
అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ ద్వారా 90 లక్షల బోగస్ ఓట్లు తొలగించబడ్డాయని పేర్కొన్నారు. తెలంగాణలోనూ పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపిస్తూ, దేశం కోసం, ధర్మం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్‌ఐఆర్ జిల్లా ఇన్‌చార్జి రావుల రాంనాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణరెడ్డి, ముధోల్ నియోజకవర్గ ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి పైడిపల్లి గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు అశోక్, ఏనుపోతుల మల్లేష్, పట్టణ అధ్యక్షుడు రావుల రాము, వివిధ మండలాల అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

