బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కాంగ్రెస్‌ను విమర్శించడం సరికాదు
సబ్బండ వర్గాలకు కాంగ్రెస్‌తోనే న్యాయం
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే
మాజీ మేయర్, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్
జులై 10: E6 న్యూస్, నిజామాబాద్(శివ ఠాకూర్)
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాష్ట్రానికి ఆయనే సరైన నాయకుడని మాజీ మేయర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సబబు కాదని ఆయన మండిపడ్డారు.
గురువారం నిజామాబాద్ నగరంలోని ప్రగతినగర్ మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మపురి సంజయ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారంతో అభివృద్ధి పనుల్లో కొంత ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితికి గత బీఆర్ఎస్ పాలనే కారణం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వారు ఇప్పుడు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
సబ్బండ వర్గాలకు కాంగ్రెస్‌తోనే న్యాయం
రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని ధర్మపురి సంజయ్ అన్నారు. సోనియా గాంధీ చొరవతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించేలా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని పేర్కొన్నారు.
రేవంత్ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
తెలంగాణతో పాటు నిజామాబాద్ జిల్లాను మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలోనే అది సాధ్యమవుతుందని ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి సెలవు తీసుకోకుండా నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు. నిజామాబాద్ నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కావస్తోందని, రానున్న రోజుల్లో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేని విధంగా ఉన్నాయని తెలిపారు.
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ధర్మపురి సంజయ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి వారికి ఆర్థికంగా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా పదవులు వస్తాయని ధర్మపురి సంజయ్ అన్నారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.

