జూలై 15 వరకు పొడి వాతావరణం కొనసాగే సూచనలు
16-19 మధ్య అక్కడక్కడా తేలికపాటి ఉరుములు, జల్లులు మాత్రమే..!
హైదరాబాద్, జూలై 12: E6 న్యూస్
తెలంగాణలో జూలై రెండో వారం నుంచి వాతావరణం అసాధారణంగా వేడిగా మారింది. సాధారణంగా ఈ సమయంలో విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలను తలపించేలా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు.
నేడు నమోదయ్యే ఉష్ణోగ్రతలు
వాతావరణ పరిస్థితులపై అందుబాటులో ఉన్న ప్రాథమిక అంచనాల ప్రకారం, జూలై 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు పెద్దగా అవకాశం కనిపించడం లేదు. ఈ కాలంలో పొడి వాతావరణంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా.
జూలై 16 నుంచి 19 మధ్య తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, ఇవి వేడి ప్రభావంతో ఏర్పడే స్థానిక వర్షాలే తప్ప రాష్ట్రవ్యాప్తంగా చెప్పుకోదగ్గ వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రాథమిక సూచనల ప్రకారం, జూలై 19 తర్వాత ఉత్తర తెలంగాణలో వర్షపాతం మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా. అయితే, రానున్న రోజుల్లో వాతావరణ వ్యవస్థల్లో మార్పులను బట్టి పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వాతావరణ పరిశీలకులు పేర్కొంటున్నారు.
- ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, ములుగు: 38–40°C
- వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి-భువనగిరి, కరీంనగర్, భూపాలపల్లి, వనపర్తి, గద్వాల్, నాగర్‌కర్నూల్, నారాయణపేట: 37–39°C
- ఉత్తర, మధ్య, పశ్చిమ తెలంగాణలోని ఇతర జిల్లాలు: 36–38°C
- హైదరాబాద్: గరిష్టంగా 35–38°C, కనిష్టంగా 25–27°C నమోదయ్యే అవకాశం ఉంది.

