చట్ట ప్రకారం సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు
నిజామాబాద్, జూలై 13: E6 క్రైమ్ న్యూస్ శివ ఠాకూర్
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని చట్టబద్ధంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ప్రజల నుంచి 39 ఫిర్యాదులను స్వీకరించారు.
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులను కమిషనర్ స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులను చట్ట ప్రకారం సత్వరమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా ఫిర్యాదులకు సంబంధించిన పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, సీఐలతో ఫోన్‌లో మాట్లాడిన పోలీస్ కమిషనర్, కేసుల ప్రస్తుత స్థితిని తెలుసుకుని త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా స్పందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా, మధ్యవర్తులు లేదా పైరవీల అవసరం లేకుండా నేరుగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీసులు మరింత చేరువై, చట్టబద్ధంగా సమస్యలను పరిష్కరించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణే జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఈ వారపు ప్రజావాణిలో మొత్తం 39 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు.

