రోడ్డు మరమ్మత్తుల వద్ద ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ మళ్లింపు – పోలీసుల చొరవకు ప్రజల ప్రశంసలు
రుద్రూరు, జూలై 13: E6 న్యూస్, ఔరాద్ అశోక్
నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు మరమ్మత్తుల పనుల సందర్భంగా ప్రమాదాలు జరగకుండా రుద్రూరు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. మరమ్మత్తులు జరుగుతున్న ప్రాంతంలో కాంట్రాక్టర్లు తప్పనిసరిగా ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ అవి లేకపోవడంతో పోలీసులు స్వయంగా చర్యలు చేపట్టారు.
ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో మరమ్మత్తులు జరుగుతున్న రహదారిని తాత్కాలికంగా మూసివేసి, వాహనాలను ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ప్రయాణించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు.రోడ్డు భద్రతపై కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం ప్రదర్శించగా, ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే స్పందించిన రుద్రూరు పోలీసుల సేవాభావాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. “ప్రజల భద్రతే ముందుగా” అన్న బాధ్యతతో వ్యవహరించిన పోలీసుల చర్యలు ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు.
రోడ్డు మరమ్మత్తుల పనులు చేపట్టే ప్రతి కాంట్రాక్టర్ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించి, ప్రమాద సూచికలు, బ్యారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

