ప్రశాంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు
భీంగల్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలే ప్రస్తుతం రాష్ట్రానికి శాపాలుగా మారాయని మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. భీంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఆరోపించారు.పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో భీంగల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ కృషి ఫలితంగానే భీంగల్‌లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతమయ్యాయని, ఇతర అభివృద్ధి పనులు కూడా పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు.
భీంగల్ వెజిటబుల్ మార్కెట్‌కు 2021లో, 100 పడకల ఆసుపత్రికి 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. అయితే రెండున్నర సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ఆ పనులను ఎందుకు పూర్తి చేయలేదో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్‌కు కేవలం 15 రోజుల ముందు బస్ డిపోను ప్రారంభించడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని కూడా ప్రశాంత్ రెడ్డి వివరించాలని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టుకునేందుకు మాత్రమే ఆ కార్యక్రమం నిర్వహించారని విమర్శించారు.నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రశాంత్ రెడ్డి ముసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే భీంగల్ అభివృద్ధి కోసం రూ.28 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిందని తెలిపారు. ఇందులో రూ.7 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని, రూ.4 కోట్ల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, మరో రూ.15 కోట్ల విలువైన పనులు ఒప్పందాల దశలో ఉన్నాయని వెల్లడించారు.ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రశాంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని, భీంగల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని మానాల మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

