భీమ్గల్ అభివృద్ధి పనుల కోసం చేపట్టిన నిరాహార దీక్షను అడ్డుకున్న పోలీసులు
100 పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బస్ డిపో, సీసీ రోడ్ల పనులు పూర్తి చేయాలని డిమాండ్
ఆర్మూర్/భీమ్గల్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్
గృహనిర్బంధం చేసి తన గొంతు నొక్కలేరని, జైల్లో పెట్టినా ప్రజా సమస్యలపై తన పోరాటం ఆగదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన ఒక రోజు కఠోర నిరాహార దీక్షకు బయలుదేరుతుండగా పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రాస్తారోకోలు లేదా ధర్నాలు నిర్వహించకుండా కేవలం నిరాహార దీక్ష మాత్రమే చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం పోలీసులతో అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఉదయం నిద్రలేవక ముందే వందలాది మంది పోలీసులు తన నివాసాన్ని చుట్టుముట్టి బయటకు వెళ్లకుండా గృహనిర్బంధం చేశారని ఆరోపించారు.భీమ్గల్‌లో గత ప్రభుత్వ హయాంలో మంజూరై దాదాపు 75 శాతం పూర్తయిన 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి చేయడం, మూతపడిన భీమ్గల్ బస్ డిపోను పునఃప్రారంభించడం, రూ.12 కోట్లతో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారని, భీమ్గల్‌లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని తొలగించి ఫ్లెక్సీలను కూడా చించివేయడం ప్రభుత్వ నిర్బంధ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను ఒకటి లేదా రెండు నెలల్లో పూర్తి చేస్తామని అధికారికంగా హామీ ఇస్తే తాను వెంటనే దీక్షను విరమించేందుకు సిద్ధమని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అయితే బెదిరింపులు, గృహనిర్బంధాలు, అరెస్టులతో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడటం తన బాధ్యత అని పేర్కొన్న ఆయన, ఇంట్లో నిర్బంధించినా, పోలీస్ స్టేషన్‌కు తరలించినా లేదా జైలుకు పంపినా తన సత్యాగ్రహం, నిరాహార దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు. ఈ న్యాయమైన పోరాటానికి భీమ్గల్ పట్టణ, మండల ప్రజలు, యువత, వివిధ కుల సంఘాలు, వీడీసీ సభ్యులు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరూ మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

