Breaking News

రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించడమే లక్ష్యం

PM RAHAT, PM RAH-VEER పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి : పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

ప్రమాద బాధితులకు సహాయం చేసిన వారికి రూ.25 వేల ప్రోత్సాహకం

నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు గోల్డెన్ అవర్‌లో సకాలంలో వైద్యసేవలు అందించి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం PM RAHAT మరియు PM RAH-VEER పథకాలను అమలు చేస్తోందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.

PM RAHAT పథకం కింద అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్ వైద్యం లేదా ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా 7 రోజుల వరకు ఉచిత చికిత్స అందిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం గుర్తించిన ఎంపానెల్డ్ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, నిజామాబాద్ జిల్లాలో మనోరమ హాస్పిటల్ మరియు ప్రగతి హాస్పిటల్ పైలట్ ఆసుపత్రులుగా ఎంపికయ్యాయని వెల్లడించారు.

PM RAH-VEER పథకం కింద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని గోల్డెన్ అవర్‌లో సమీప ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేందుకు సహాయం చేసిన వ్యక్తిని రాహ్-వీర్ గా గుర్తించి కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తుందని తెలిపారు.

రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను eDAR (Electronic Detailed Accident Report) వ్యవస్థ ద్వారా నమోదు చేసి, పోలీస్, రవాణా, ఆరోగ్య శాఖలు, ఆసుపత్రులు, బీమా సంస్థలు సమన్వయంతో వేగంగా చర్యలు చేపడతాయని కమిషనర్ వివరించారు.

రోడ్డు ప్రమాద బాధితులను చూసిన వెంటనే భయపడకుండా సహాయం చేయాలని, గోల్డెన్ అవర్‌లో అందించే సహాయం ఒక ప్రాణాన్ని కాపాడగలదని ఆయన పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే 112, 100 లేదా 108 నంబర్లకు సమాచారం అందించాలని, ప్రతి పౌరుడు బాధ్యతతో స్పందించి ఒక రాహ్-వీర్ గా నిలవాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *