హల్దీ వాగు ద్వారా నీటి విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలి
కోటగిరిలో రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మహాధర్నా.. అధికారులకు వినతిపత్రం
కోటగిరి, జూలై 15: ఈ సిక్స్ న్యూస్ అశోక్ కాంబ్లే
వర్షాభావ పరిస్థితులతో నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో సాగు చేసిన వేలాది ఎకరాల పంటలు ఎండుముఖం పడుతున్నాయని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం కోటగిరి మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించిన అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వర్షాలు కురవక వరి, సోయాబీన్, మొక్కజొన్న, పెసర, మినుము తదితర పంటలు తీవ్ర నీటి ఎద్దడితో ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, గతంలో అప్పటి శాసనసభాపతి, ప్రస్తుత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి హల్దీ వాగు ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని నిజాంసాగర్‌కు తరలించవచ్చని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ హామీని అమలు చేసి వెంటనే నీటి విడుదల చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
లక్షల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు రైతుల అవసరాల కోసం ఉపయోగపడాల్సిన సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వర్షాభావంతో చెరువులు, కుంటలు ఎండిపోవడంతో పాటు భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన పంటలు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారని అన్నారు.
ఇటీవల జాకోర ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి హాజరైన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజాంసాగర్‌కు నీటిని విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. మంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరారు.
అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతుల సమస్యలపై దృష్టి సారించి, సాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉండాలని, ఆలస్యం చేయకుండా నిజాంసాగర్‌కు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదే సమస్యపై రెండు రోజుల క్రితం బీజేపీ నాయకులు కూడా తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. నిజాంసాగర్ ఆయకట్టు రైతుల సమస్యపై అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.
మహాధర్నాలో బీఆర్ఎస్ నాయకులు జుబేర్, అంజిరెడ్డి, శ్రీనివాసరావు, ఎలమంచిలి శ్రీనివాసరావు, నార్ల రత్నకుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

