RWS, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం – లీకేజీల నివారణ, నాణ్యమైన నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి
నిజామాబాద్, జూలై 18: E6 tv NEWS (శివ ఠాకూర్).
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో RWS, మిషన్ భగీరథ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన తాగునీటి సరఫరా, నిర్వహణ, నాణ్యతపై పలు కీలక సూచనలు చేశారు.
వర్షాకాలంలో కూడా తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించిన ఎమ్మెల్యే, మిషన్ భగీరథ పైప్‌లైన్‌లలో లీకేజీలు, సాంకేతిక లోపాలు ఎక్కడా లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరమ్మత్తులు అవసరమైన ప్రాంతాల్లో వెంటనే పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు ప్రజల్లో నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. భూగర్భ జలమట్టం పెరిగేలా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ప్రతి గ్రామానికి నిర్ణీత సమయానికి తాగునీరు అందేలా సమయపాలన పాటించాలని, తాగునీటి నాణ్యతపై నిరంతరం క్వాలిటీ పరీక్షలు నిర్వహించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంకులను గుర్తించి మరమ్మత్తులు చేయాలని, ప్రమాదకర స్థితిలో ఉన్న ట్యాంకులను వెంటనే తొలగించి ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజల నుంచి తాగునీటి సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు రాకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. పరిపాలనా లేదా సాంకేతిక సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తాగునీటి సరఫరాలో అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు.
ఈ సమీక్ష సమావేశంలో RWS (మిషన్ భగీరథ) ఈఈలు కే. రాకేష్, నరేష్ బాబు, డీఈఈలు నవీన్ రెడ్డి, కౌశిక్, వెంకటేశ్వర్ గౌడ్, ఏడు మండలాల ఏఈఈలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

