మూడు వారాల్లో 559 కేసులు నమోదు – రూ.52.80 లక్షల జరిమానా
31 మందికి వారం రోజుల జైలు శిక్ష
నిజామాబాద్, జూలై 18: E6 tv NEWS (శివ ఠాకూర్)
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. గత మూడు వారాల కాలంలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 559 మంది వాహనదారులు పట్టుబడినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ వెల్లడించారు.
జూన్ 29 నుంచి జూలై 17 వరకు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించగా, మద్యం సేవించి వాహనాలు నడిపిన 559 మందిపై కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా, 31 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించగా, మిగిలిన వారిపై కలిపి రూ.52.80 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, ప్రజలు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేయవద్దని సూచించారు.డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తామని తెలిపారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి గురైతే బీమా (ఇన్సూరెన్స్) ప్రయోజనాలు కూడా లభించవని హెచ్చరించారు.
మైనర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే, మైనర్‌తో పాటు వాహన యజమానిపై కూడా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ఒకసారి కంటే ఎక్కువసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.మోటార్ వెహికల్ చట్టం–1989 (2019 సవరణ) ప్రకారం మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండూ, రెండోసారి పట్టుబడితే రూ.15,000 జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని పోలీస్ కమిషనర్ వివరించారు.
ప్రజలంతా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య విజ్ఞప్తి చేశారు.

