Breaking News

నిజామాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో చోరీ బైక్, బంగారు గొలుసుతో నిందితుడు పట్టివేత.

నిజామాబాద్, జూలై 18 : E6 tv NEWS (శివ ఠాకూర్).

నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక డ్రైవ్‌లో చోరీకి గురైన మోటార్ సైకిల్‌తో పాటు బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం ట్రాఫిక్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్‌ఐ వినోద్, ఆర్‌ఎస్‌ఐ దేవిసింగ్, ట్రాఫిక్ సిబ్బంది నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేకుండా అనుమానాస్పదంగా వస్తున్న ఓ మోటార్ సైకిల్‌ను పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా, బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి భయపడి వాహనాన్ని అక్కడే వదిలివేసి పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు వారిని వెంబడించగా, ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి చీకటిని ఆసరాగా చేసుకుని తప్పించుకున్నాడు.

పట్టుబడిన వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద నుంచి ఒక బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారు వదిలివెళ్లిన మోటార్ సైకిల్‌ను పరిశీలించగా, అది గతంలో చోరీకి గురైన వాహనమని పోలీసులు గుర్తించారు.అదుపులోకి తీసుకున్న నిందితుడిని, స్వాధీనం చేసుకున్న చోరీ మోటార్ సైకిల్‌ను, బంగారు గొలుసును తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల కోసం నిజామాబాద్ సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తత, వేగవంతమైన చర్యలతో నిందితుడిని పట్టుకున్న తీరును స్థానిక ప్రజలు అభినందించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ ఆర్‌ఐ వినోద్‌తో పాటు డ్రైవ్‌లో పాల్గొన్న ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని అభినందించారు.

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

పగలు, రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు లేదా అనుమానాస్పద వాహనాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని నిజామాబాద్ పోలీసులు ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *