నిజామాబాద్‌తో పాటు 11 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం – హైదరాబాద్‌లో సాయంత్రం జల్లులు
నిజామాబాద్, జూలై 19: E6 tv NEWS.
రాష్ట్రంలో నేడు (జూలై 19) ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు, ముఖ్యంగా రాత్రి వేళల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విశ్లేషకులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అలాగే సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.రాజధాని హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం కొనసాగనున్నప్పటికీ, సాయంత్రం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు లేదా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా.
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. రైతులు కూడా వర్ష పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పనులు చేపట్టాలని సూచించారు.

