Breaking News

అరెస్టులతో విద్యార్థుల గొంతు నొక్కలేరు: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నీట్ పేపర్ లీక్‌పై కాంగ్రెస్ నిరసన – కేంద్ర మంత్రుల రాజీనామాకు డిమాండ్

నిర్మల్‌లో ధర్నా, దిష్టిబొమ్మ దహనం – కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

నిర్మల్, జూలై 22 (E6 tv NEWS: Md అమీనుద్దీన్): నీట్ (NEET-UG) పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఆర్డీవో కార్యాలయం ఎదురుగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సమరసింహ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

రాజీనామా చేయాలి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సమాధానం చెప్పాలని కోరారు.

ప్రజాస్వామ్యానికి విరుద్ధం

విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అణచివేయడం సరైంది కాదన్నారు.

యువతకు కాంగ్రెస్ అండ

నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించబోదని తెలిపారు. దేశ యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *