యాజమాన్యాలకూ బాధ్యత.. అవసరమైతే ప్రత్యేక చట్టం: సీఎం రేవంత్ రెడ్డి
E6 tv NEWS : రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు సంబంధించిన ఘటనలు చోటుచేసుకుంటే ఆయా సంస్థల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
మాదక ద్రవ్యాల నిరోధంపై ఉన్నతస్థాయి సమీక్ష
రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ, భద్రత కమిటీల పనితీరుపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
క్యాంపస్ బయట కార్యకలాపాలపైనా నిఘా
విద్యా సంస్థల పరిసరాల్లో మాత్రమే కాకుండా క్యాంపస్ వెలుపల జరిగే అనుమానాస్పద డ్రగ్స్ కార్యకలాపాలపై కూడా సమాచారం అందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు.
టోల్‌ఫ్రీ నంబర్, క్యూఆర్ కోడ్ ఏర్పాటు
డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని సులభంగా అందించేందుకు విద్యా సంస్థల ఆవరణలో టోల్‌ఫ్రీ నంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
డీ-అడిక్షన్తో పాటు కఠిన చర్యలు
డ్రగ్స్ వినియోగదారులను గుర్తించడం, మాదక ద్రవ్యాల అలవాటు నుంచి బయటపడేలా డీ-అడిక్షన్ సెంటర్లకు పంపించడం, కౌన్సిలింగ్ నిర్వహించడం వంటి చర్యలతో పాటు పదేపదే డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే కఠిన శిక్షలు అమలు చేసే విధానాన్ని రూపొందించాలని సీఎం ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఈగల్ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

