డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ వీడియో కాన్ఫరెన్స్లో సమగ్ర సమీక్ష
నిజామాబాద్, జూలై 25: (E6 tv NEWS : శివ ఠాకూర్)
గోదావరి పుష్కరాలు–2027ను భక్తులకు సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) శ్రీ మహేష్ భగవత్, ఐపీఎస్., గోదావరి పరివాహక ప్రాంతాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ, అత్యవసర సేవల సమన్వయం, విపత్తు నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతంపై సమగ్రంగా సమీక్షించారు.
రెంజల్, మెండోరా, ఏర్గట్ల ఘాట్లపై ప్రత్యేక దృష్టి
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెంజల్, మెండోరా, ఏర్గట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న గోదావరి పుష్కర ఘాట్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
సీసీటీవీలు, డ్రోన్ నిఘా, కమాండ్ కంట్రోల్ హాల్
భక్తుల భద్రత కోసం తాత్కాలిక పోలీస్ అవుట్పోస్టులు, ఆధునిక సౌకర్యాలతో కమాండ్ అండ్ కంట్రోల్ హాల్, సీసీటీవీ కెమెరాల విస్తరణ, డ్రోన్ నిఘా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, బ్యారికేడింగ్, పార్కింగ్ ప్రణాళిక, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, మహిళలు, చిన్నారులు, వృద్ధుల కోసం ప్రత్యేక సహాయక కేంద్రాల ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
విపత్తు నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ
పుష్కరాల సమయంలో భారీగా వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ నిర్వహణ, అగ్నిమాపక, వైద్య, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం, తాగునీరు, లైటింగ్, పారిశుద్ధ్యం, తప్పిపోయిన వారి కోసం ప్రత్యేక కేంద్రాలు, సమాచార వ్యవస్థల బలోపేతంపై విస్తృతంగా చర్చించారు.
అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ప్రతి పోలీస్ యూనిట్ ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం పెంచుకుని భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన పుష్కరాలను అందించేలా చర్యలు చేపట్టాలని డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాశ్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు, గోదావరి పరివాహక ప్రాంతాల సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.




