కేంద్రమంత్రి రాజీనామాతో సరిపోదు.. పేపర్ లీకేజీల నివారణకు వ్యవస్థాగత సంస్కరణలు అవసరం: కల్వకుంట్ల కవిత
NTAకు UPSC తరహాలో స్వతంత్ర హోదా కల్పించాలని డిమాండ్
విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని సూచన
జూలై 26: E6 tv NEWS శివ ఠాకూర్. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం స్వాగతించదగ్గ పరిణామమే అయినప్పటికీ, దానితో సమస్యకు పూర్తి పరిష్కారం లభించదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. విద్యార్థుల నిరంతర పోరాటం, నిరసనల ఫలితంగానే కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె అభిప్రాయపడ్డారు.
కేవలం రాజకీయ నష్టాన్ని తగ్గించుకునేందుకు రాజీనామా చేయించడం కాకుండా, భవిష్యత్తులో ఇటువంటి పేపర్ లీకేజీలు జరగకుండా విద్యా పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. UPSC తరహాలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి చట్టబద్ధమైన స్వతంత్ర హోదా కల్పించాలని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేలా కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించారు.నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున పరిహారం ప్రకటించాలని ఆమె కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 20న విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగిన లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండించిన కవిత, దమనకాండకు బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.కేవలం కేంద్ర మంత్రితో రాజీనామా చేయించి కంటితుడుపు చర్యలతో సరిపెట్టాలని ప్రభుత్వం భావిస్తే ప్రజలు, విద్యార్థులు అంగీకరించరని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. భవిష్యత్‌లో పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు వ్యవస్థాగత మార్పులే శాశ్వత పరిష్కారమని ఆమె పేర్కొన్నారు.

