Breaking News

కోతుల బెడదకు చెక్ పెట్టిన యువకుడు

చింపాంజీ వేషంతో పంటలు, ఇళ్లను కాపాడుతున్న బాలాజీ

నిర్మల్, జూలై 28: E6 tv NEWS(తిరుపతి గౌడ్)

నిర్మల్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కోతుల బెడదకు ఓ యువకుడు వినూత్న పరిష్కారం చూపి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. చింపాంజీ వేషం ధరించి కోతులను తరిమేస్తూ రైతులకు, గ్రామస్తులకు అండగా నిలుస్తున్నాడు.

నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఎల్వీ గ్రామానికి చెందిన బాలాజీ అనే యువకుడు గ్రామంలో కోతుల సమస్య తీవ్రంగా ఉండటంతో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. గుంపులు గుంపులుగా తిరుగుతున్న కోతులు ఇళ్లపైకి ఎక్కి పైకప్పులను ధ్వంసం చేయడంతో పాటు సమీపంలోని పంటపొలాల్లోకి వెళ్లి పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యకు పరిష్కారంగా బాలాజీ చింపాంజీ వేషం ధరించి కోతులు సంచరించే ప్రాంతాలకు వెళ్తున్నాడు. అతడిని చూసిన వెంటనే కోతుల గుంపులు భయపడి అక్కడి నుంచి పారిపోతుండటంతో గ్రామంలో కోతుల బెడద గణనీయంగా తగ్గిందని స్థానికులు చెబుతున్నారు.

బాలాజీ వినూత్న ఆలోచనతో పంటలను కాపాడుకోగలుగుతున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి హాని చేయకుండా కోతులను తరిమివేసే ఈ పద్ధతి ఆదర్శవంతమని గ్రామస్తులు కొనియాడుతున్నారు. బాలాజీ చేసిన వినూత్న ప్రయత్నం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *