Breaking News

వరద కాలువ తూమ్‌లు తెరిచి చెరువులు నింపాలి: బీఆర్‌ఎస్ డిమాండ్

రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు నీరు అందించిన ఘనత కేసీఆర్, ప్రశాంత్ రెడ్డిదేనని బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్య

మోర్తాడ్, ఆగస్టు 2: E6 tv NEWS (తాటికొండ గంగాధర్).

కాలేశ్వరం ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ ద్వారా కమర్‌పల్లి–మోర్తాడ్ మండలాల సరిహద్దులోని వరద కాలువలోకి గోదావరి జలాలు చేరడం పట్ల ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని కమర్‌పల్లి మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ రేగుంట దేవేందర్ తెలిపారు. తిమ్మాపూర్ వరద కాలువ బ్రిడ్జి వద్ద బీఆర్‌ఎస్ నాయకులు, రైతులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రేగుంట దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో రివర్స్ పంపింగ్ విధానం అమలులోకి రావడంతో వరద కాలువలో ఏడాది పొడవునా నీరు ప్రవహించి రైతులకు ప్రయోజనం చేకూరిందని అన్నారు. దీని ద్వారా మెట్‌పల్లి, వేములవాడ, జగిత్యాల, బాల్కొండ ప్రాంతాల రైతులు ఖరీఫ్, రబీ పంటలకు సమృద్ధిగా సాగునీరు వినియోగించుకున్నారని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తూ రివర్స్ పంపింగ్ నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం వరద కాలువలో మళ్లీ నీరు ప్రవహించడం ఆ ప్రచారాలకు సమాధానమని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత వరద కాలువపై గ్రామాలకు మూడు నుంచి నాలుగు అడుగుల సామర్థ్యంతో తూమ్‌లు ఏర్పాటు చేయడం వల్ల చెరువులు వేగంగా నిండే పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం వరద కాలువలో నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో వెంటనే తూమ్‌లు తెరిచి ఆయకట్టు గ్రామాల చెరువులను నింపాలని బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు బద్ధం అశోక్, యాల్ల హన్మంత్ రెడ్డి, కమ్మర్పల్లి మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, మాజీ ఎంపీటీసీ అశోక్, సంత నడిపి రాజేశ్వర్, బద్దం రాజేశ్వర్, ప్రభుదాస్, దొంకల్ గంగారెడ్డి, పిప్పర అనిల్, అవారి మురళి, రఘు, రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *