Breaking News

ప్రజల కోసం పనిచేయాలి.. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకోవద్దు: ముత్యాల సునీల్ కుమార్

మెండోరలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిశీలన..

మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఇంచార్జ్ విమర్శలు

మెండోర, ఆగస్టు 4: E6 tv NEWS (తాటికొండ గంగాధర్).

మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పదేపదే ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు.మంగళవారం మెండోర మండల కేంద్రంలోని రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2017 మేలో ప్రారంభమైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఐదేళ్లు మంత్రిగా, ప్రస్తుతం మూడేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇప్పటికీ పూర్తికాలేదని విమర్శించారు. ఇళ్ల సముదాయానికి సరైన రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు లేకపోవడం దురదృష్టకరమన్నారు.

ప్రశాంత్ రెడ్డి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న బాధ్యతను గుర్తించి ప్రభుత్వ పెద్దలను కలిసి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఎమ్మార్వోలతో సమావేశాలు నిర్వహిస్తే, వాటిపై జిల్లా కలెక్టర్‌కు ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు చేయడం బాధ్యతారాహిత్యమని ఆరోపించారు.

ప్రజల ప్రయోజనాల కోసం ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం వద్ద పనులు కోరితే ఎలాంటి భేషజాలు లేకుండా పూర్తి సహకారం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి బాల్కొండ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సర్పంచ్‌లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *