Breaking News

బిచ్కుంద ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ స్థాయికి అభివృద్ధి చేయాలి

డాక్టర్లు, సిబ్బంది, ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని ప్రజల డిమాండ్

బిచ్కుంద, ఆగస్ట్ 4: (E6 tv NEWS, M. మస్నాజీ).

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని 30 పడకల బిచ్కుంద ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అన్ని రకాల వైద్య సేవలు అందించే ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది నియామకం, 24 గంటల వైద్య సేవల కల్పనపై పలు దశల్లో అధికారులకు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు.2026 జనవరి 19న ప్రజావాణి కార్యక్రమంలో ఆసుపత్రిలో డాక్టర్లను నియమించాలని విజ్ఞప్తి చేయగా, ఫిబ్రవరి 18న 24 గంటల పాటు డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో 17 మంది సిబ్బంది, నలుగురు వైద్యులను నియమించినట్లు అధికారులు వెల్లడించినప్పటికీ, జుక్కల్ నియోజకవర్గంలో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న ఈ కేంద్రంలో మరింత ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయాల్సిన అవసరం లేకుండా ఆపరేషన్ థియేటర్లు పూర్తి స్థాయిలో పనిచేసేలా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

అలాగే ఆసుపత్రిలో క్రింది ప్రత్యేక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

  • మెదడు, నరాల శస్త్రచికిత్సలు
  • గుండె సంబంధిత శస్త్రచికిత్సలు
  • గైనకాలజీ, ప్రసూతి శస్త్రచికిత్సలు
  • ఎముకలు, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు
  • సాధారణ, లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సలు

అదేవిధంగా అత్యవసర సేవల కోసం సరిపడా అంబులెన్సులు అందుబాటులో ఉండాలని, బిచ్కుంద ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఆదర్శ ప్రభుత్వ ఆసుపత్రిగా గుర్తింపు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.అలాగే కొడప్గల్, జుక్కల్, మద్నూర్, పిట్లం, డోంగ్లీ, నిజాంసాగర్, మహమ్మద్‌నగర్ మండలాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా తగిన సంఖ్యలో వైద్యులు, సిబ్బందిని నియమించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *