Breaking News

ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై దశలవారీ పోరాటం

ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలి: టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్

ఆగస్టు 29న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహణకు యూఎస్‌పీసీ నిర్ణయం

ఏర్గట్ల, ఆగస్టు 7: (E6 tv NEWS, తాటికొండ గంగాధర్).

ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఉద్యమాలను చేపట్టనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఏర్గట్ల మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలన్నీ విద్యారంగానికి సంబంధించినవేనని, వాటి పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని, విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని విమర్శించారు.పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తున్నామని ప్రకటించినప్పటికీ వాటిని కేవలం యూకేజీ వరకు మాత్రమే పరిమితం చేశారని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను మధ్యాహ్నం వరకు మాత్రమే నిర్వహించడం వల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో సాయంత్రం వరకు తరగతులు కొనసాగుతుండగా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం అలాంటి సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థుల చేరికలు తగ్గే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు.

ప్రాథమిక విద్యకు నష్టదాయకంగా భావిస్తున్న జీఓ-25ను సవరించాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని, 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలకు డీఈవోలు, రెవెన్యూ డివిజన్లకు డిప్యూటీ ఈవోలు, ప్రతి మండలానికి ఎంఈవో పోస్టులు మంజూరు చేయాలని, పీఓ-2018కు అనుగుణంగా సర్వీస్ నిబంధనలు రూపొందించాలని కోరారు.ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, టెట్‌లో సర్వీస్ వెయిటేజ్, స్పెషల్ టెట్, సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ అమలు, పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలు, జీఓ-317 బాధితులకు న్యాయం, హెల్త్ కార్డుల పూర్తి స్థాయి అమలు, పెండింగ్ బిల్లుల విడుదల తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యూఎస్‌పీసీ కోరింది.

ఈ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 15 వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకావడం, ఆగస్టు 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసనలు, తహసీల్దార్లకు వినతిపత్రాల సమర్పణ, ఆగస్టు 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ఆగస్టు 29న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు నాయకులు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా “చలో అసెంబ్లీ” కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షుడు పి. గణేష్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *