Breaking News

గోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును ఢీకొన్న లారీ..

ఇద్దరు మహిళలు మృతిమరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్, ఆగస్టు 13: (E6 tv NEWS, శివ ఠాకూర్).

ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై టైర్ పంచర్ కావడంతో ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతానికి చెందిన భక్తులు హైదరాబాద్‌లోని చిన్న జీయర్ స్వామి దర్శనం కోసం రెండు టూరిస్ట్ బస్సుల్లో బయలుదేరారు. గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో ముందుగా వెళ్తున్న టూరిస్ట్ బస్సు TG 01 T 1864 టైర్ పంచర్ కావడంతో బస్సులను జాతీయ రహదారిపై నిలిపారు. కొంతమంది ప్రయాణికులు బస్సు దిగిపోయి రహదారి మధ్యలోని డివైడర్‌పై కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది.వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ GT 27 TF 7482 డ్రైవర్ ఆగి ఉన్న బస్సును సకాలంలో గుర్తించకపోవడంతో బలంగా ఢీకొట్టాడు. లారీ ఢీకొట్టడంతో బస్సు ముందుకు కదిలి డివైడర్‌పై ఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుజాత (54), మాధవి (47) అక్కడికక్కడే మృతి చెందారు. సునీత, చిటక్క తీవ్రంగా గాయపడటంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్

ప్రమాద సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వాహనాలు నిలిచిపోయినప్పుడు అప్రమత్తంగా ఉండాలి

జాతీయ రహదారులపై టైర్ పంచర్ లేదా సాంకేతిక లోపం కారణంగా వాహనాలు ఆగిపోయినప్పుడు అత్యంత జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. వాహనం ఆగిన వెంటనే హజార్డ్ లైట్లు ఆన్ చేయడంతో పాటు, తగిన దూరంలో రిఫ్లెక్టివ్ వార్నింగ్ ట్రయాంగిల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రయాణికులు రహదారిపైకి వచ్చి డివైడర్లపై కూర్చోవడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.

ఈ ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం తదితర అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ, ఆర్మూర్ ఎంవీఐ రాహుల్ కుమార్, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, బాల్కొండ ఎస్సైలు, అసిస్టెంట్ ఎంవీఐ తదితరులు సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *