Breaking News

వేంసూరు మండలంలో అధికారుల పనితీరుపై ప్రజల ఆగ్రహం

ప్రభుత్వ లక్ష్యాలకు కొందరు అధికారుల తీరుతో గండి?

ప్రజావాణి ప్రచారంలో నిర్లక్ష్యం.. ప్రజలకు అందని సంక్షేమ పథకాలు

ప్రజావాణి ప్రచారంలో నిర్లక్ష్యం.. ప్రజలకు అందని సంక్షేమ పథకాలు

స్థానికంగా అందుబాటులో లేని సిబ్బందిపై మండల ప్రజల అసంతృప్తి

పనితీరులో మార్పు లేకుంటే చర్యలు తప్పవంటున్న ప్రజాప్రతినిధులు

వేంసూరు,ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).
ప్రజలకు సంక్షేమ పాలన అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి కొందరు అధికారుల పనితీరు అడ్డంకిగా మారుతోందని వేంసూరు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలకు చేరవేయడంలో మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించకపోవడం, ప్రజలకు సమాచారం అందించకపోవడం, సంబంధిత అధికారులు సక్రమంగా అందుబాటులో లేకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమమే ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంటే ప్రభుత్వ ఉద్దేశం ఎలా నెరవేరుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అలాగే ఇందిరమ్మ ఇళ్లతో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు చేరడంలో జాప్యం జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పథకాల అమలులో పారదర్శకత, వేగం పెరగాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు.మరోవైపు కొందరు ఉద్యోగులు మండల కేంద్రంలో స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం వల్ల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం మరింత చేరువ కావాల్సి ఉండగా, కొందరు అధికారుల పనితీరులో ఆశించిన మార్పు కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.అధికారుల పనితీరుపై సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ విజయ్ కుమార్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసి, అధికారులను మందలించినట్లు తెలుస్తోంది. పనితీరులో మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.

బదిలీ వేటు తప్పదా?

ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు సమర్థవంతంగా నిర్వహించే అధికారులకే మండలంలో స్థానం ఉంటుందని, పనితీరులో మార్పు లేకపోతే బదిలీ లేదా క్రమశిక్షణ చర్యలు తప్పవనే చర్చ ప్రస్తుతం వేంసూరు మండలంలో జోరుగా సాగుతోంది.ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రజలకు చేరాలంటే అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు మరింత బాధ్యత తీసుకుంటారా?
లేక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
వేంసూరు మండలంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి?
ఇప్పుడు ఇదే మండల ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *