Breaking News

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రాజకీయ గ్రహణం?

దళిత, పేద ప్రజలను వెంటాడుతున్న సమస్యలు.. పేదింటి కలగా మిగులుతున్న ఇందిరమ్మ ఇళ్లు

వేంసూరు, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి). 

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన దళిత, పేద ప్రజలకు పూర్తిస్థాయిలో అందడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని, పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా పేదింటి కల అయిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విషయంలో అనేక మంది అర్హులకు ఇళ్లు మంజూరు కాలేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో పేద కుటుంబాలు రేకుల షెడ్లలోనే జీవనం సాగిస్తున్నామని, వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా ఎస్సీ, బీసీ కార్పొరేషన్ రుణాలు, రైతు రుణమాఫీ కింద రూ.2 లక్షల వరకు రుణమాఫీ, భూమిలేని అత్యంత పేద కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం, అర్హులైన పేదలకు రేషన్ కార్డుల మంజూరు వంటి పథకాలు కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.నిరుద్యోగ యువతీ యువకులకు ఆర్థికంగా అండగా నిలవాల్సిన రాజీవ్ యువ వికాసం పథకం కూడా తమకు అందని ద్రాక్షగా మారిందని పలువురు యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలంలోని లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన మంచాల ఇందిర భర్త శుభ నాగేంద్ర మృతి చెందడంతో కుమారుడు గోపిని కూలి పనులు చేసుకుంటూ చదివిస్తున్నానని తెలిపారు. ఎన్నికల సమయంలో పేదలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీలు ఇచ్చినా, ఇప్పటికీ తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమ్మ ఇంట్లో తలదాచుకుంటూ జీవిస్తున్నానని తెలిపారు.కందుకూరు, మర్లపాడు తదితర గ్రామపంచాయతీల్లోనూ పలువురు అర్హులు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. రేకుల షెడ్లలో నివసిస్తూ వర్షాలకు తడుస్తూ, ఎండలకు ఎండుతూ, విషసర్పాల భయంతో పిల్లాపాపలతో దుర్భర జీవితం గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదని, తమ తలరాతను మార్చే నాథుడు కరువయ్యాడని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *