భీంగల్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).
గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు కార్మికులకు అవసరాల ఆధారిత కనీస వేతనం నెలకు రూ.39,373 చెల్లించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా భీంగల్ మండల కేంద్రంలోని ALO కార్యాలయం ఎదుట ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. అనంతరం కార్మిక శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా TUCI నిజామాబాద్-కామారెడ్డి సంయుక్త జిల్లా ఉపాధ్యక్షులు కె. రాజేశ్వర్ మాట్లాడుతూ, కార్మికుల జీవన అవసరాలను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ విధానాల ఆధారంగా కనీస వేతనాలను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కార్మికుడు, అతని కుటుంబం ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడంతో పాటు ఆరోగ్యం, పని సామర్థ్యం, గౌరవప్రదమైన జీవనం కొనసాగించే స్థాయిలో కనీస వేతనం ఉండాలని అన్నారు.
15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిర్దేశించిన విధానాలు, సుప్రీంకోర్టు తీర్పుల్లో గుర్తించిన సూత్రాల ఆధారంగా అవసరాల ఆధారిత కనీస వేతనాన్ని నిర్ణయించాలని కోరారు. నాలుగు వినియోగ యూనిట్ల ప్రమాణం, గృహ వసతి, వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ (VDA) ద్వారా జీవన వ్యయాల పెరుగుదలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకుని మే 2026 నాటికి నెలకు రూ.39,373ను అవసరాల ఆధారిత కనీస వేతనంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత, PF, ESI సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు ఖాతాల్లో జమ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని TUCI నాయకులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయకపోతే సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భీంగల్ మండల అధ్యక్షులు నాగరాజు, రాజన్న, ఆశన్నతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.


