మద్నూర్, ఆగస్టు 25: (E6tv NEWS ప్రతినిధి).
మద్నూర్ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ మండల ప్రజలు సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో సాయిలు, తహసీల్దార్ ముజీబ్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ.. గతంలో మద్నూర్ మండలం నిజామాబాద్ జిల్లాలో ఉన్న సమయంలో పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల సేవలు సులభంగా అందుబాటులో ఉండేవని తెలిపారు. ప్రస్తుతం మద్నూర్ నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రం సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉండగా, నిజామాబాద్ జిల్లా కేంద్రం కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్నారు.ప్రజల రాకపోకలు, పరిపాలనా సౌలభ్యం, సమయం మరియు ప్రయాణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని మద్నూర్ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని అధికారులను కోరారు. ప్రజల విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు అభ్యర్థించారు.

