Breaking News

అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలి

కంటేశ్వర్‌లో ఓటర్లకు నోటీసులు అందజేస్తున్న విధానం పరిశీలన

నిజామాబాద్, ఆగస్టు 27: అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ జరగని వారు, అలాగే పేరు, వయసు తదితర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు హియరింగ్‌కు హాజరు కావాలని కోరుతూ బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి నోటీసులు అందజేస్తున్న ప్రక్రియను గురువారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

నిజామాబాద్ నగరంలోని 19వ డివిజన్ పరిధిలోని కంటేశ్వర్‌లో బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు నోటీసులు అందజేస్తున్న తీరును కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నదని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు విధుల్లో అందుబాటులో ఉన్నారా లేదా అన్నది పరిశీలించిన కలెక్టర్… ఇప్పటివరకు ఎంతమంది ఓటర్లకు నోటీసులు అందించారు, ఇంకా ఎంతమందికి అందించాల్సి ఉంది, పోలింగ్ కేంద్రాల పరిధిలో మ్యాపింగ్ జరగని ఓటర్లు ఎంతమంది ఉన్నారు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ధృవీకరణ అవసరమైన ఓటర్ల ఇళ్లకు బీఎల్‌ఓలు స్వయంగా వెళ్లి నోటీసులు అందించాలని కలెక్టర్ సూచించారు. నిర్ణయించిన సమయానికి ఓటరు హాజరు కాలేకపోతే మరోసారి నోటీసు అందించాలని ఆదేశించారు. నోటీసు అందించే సమయంలోనే ఓటర్లు అవసరమైన ధృవీకరణ పత్రాలను సమర్పిస్తే వాటిని స్వీకరించవచ్చని తెలిపారు.

నిర్ణీత గడువులోపు ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని, అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు.కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బీఎల్‌ఓ సూపరింటెండెంట్ మురళి, బీఎల్‌ఓ లావణ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *