Breaking News

ముందస్తు టికెట్ బుకింగ్ సద్వినియోగం చేసుకోండి

ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి విజ్ఞప్తి

నిజామాబాద్, ఆగస్టు 28:( E6tv NEWS: ప్రతినిధి).

ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ అందిస్తున్న ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా ప్రయాణికులు తమకు అనుకూలమైన సమయానికి సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రయాణానికి ముందుగానే టికెట్ బుక్ చేసుకోవడం వల్ల చివరి నిమిషంలో ఎదురయ్యే ఇబ్బందులు, ఆలస్యాలను నివారించడంతో పాటు ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌లో.. కౌంటర్లలో బుకింగ్ సౌకర్యం

ఆగస్టు 31, సోమవారం స్వస్థలాలకు వెళ్లే లేదా తిరుగు ప్రయాణం చేసే ప్రయాణికులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలో కూడా టికెట్ బుకింగ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉందన్నారు.

రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు

ముందస్తు టికెట్ బుకింగ్ ద్వారా ప్రయాణికుల రద్దీని ముందుగానే అంచనా వేసే అవకాశం టీజీఎస్ఆర్టీసీకి ఉంటుందని రీజినల్ మేనేజర్ తెలిపారు. అవసరానికి అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు.కావున ప్రయాణికులందరూ ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకోవాలని రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *