Breaking News

కవిత వ్యాఖ్యలకు వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్

కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న వారినే కవిత టార్గెట్ చేస్తున్నారు : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ, సెప్టెంబర్ 2: (E6tv NEWS: ప్రతినిధి)

బీఆర్ఎస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కవితను కేసీఆర్‌కు తాను దూరం చేయడానికి ప్రయత్నించానన్న ఆరోపణలను ఖండించారు.కవితను, కేసీఆర్‌ను కలపడానికి తానే ప్రయత్నించానని, విడగొట్టడానికి ప్రయత్నించానన్న విషయం కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. పార్టీ లైన్ దాటిన తర్వాతే కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వ్యాఖ్యానించారు.తాను, తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి టీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యులమని, తెలంగాణ ఆవిర్భావానికి ముందే పార్టీతో ఉన్నామని గుర్తుచేశారు. “బీఆర్ఎస్ అంటేనే ప్రశాంత్ రెడ్డి.. ప్రశాంత్ రెడ్డి అంటేనే బీఆర్ఎస్” అని అన్నారు. కవిత మధ్యలో వచ్చి మధ్యలో వెళ్లిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌తో తాను మంతనాలు చేశానన్న కవిత ఆరోపణలను ప్రశాంత్ రెడ్డి ఖండించారు. ప్రస్తుతం కష్టకాలంలో కేసీఆర్ వెంట నిలబడింది తానా, కవితనా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో, అసెంబ్లీ బయట, జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్నది తానేనని అన్నారు.

నేను కాంగ్రెస్‌లో ఎవరితోనూ మంతనాలు చేయలేదు. లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఉండి చెబుతున్నా” అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కవిత కూడా కాంగ్రెస్ నేతలతో రహస్యంగా మంతనాలు చేయలేదని చెప్పగలరా అని ప్రశ్నించారు.

తనపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడటం తగదన్నారు. మొదటి నుంచి పార్టీతో ఉన్న జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, హరీశ్ రావు, తనలాంటి నాయకులను కవిత టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న నాయకత్వాన్ని బలహీనపరిచేలా కవిత వ్యవహరిస్తున్నారని విమర్శించారు.కవిత సభలో కన్నీళ్లు పెట్టుకోవడాన్ని రాజకీయ సానుభూతి పొందే ప్రయత్నంగా తాను భావిస్తున్నానని అన్నారు. అయితే అది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. కవిత చర్యల వల్ల కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఒక బిడ్డగా ఆమె ఆలోచించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై కవిత విమర్శలు చేసినప్పుడు ఆశ్చర్యం కలగలేదని, అయితే తనపై ఆరోపణలు చేయడం బాధ కలిగించిందన్నారు.కవితను రెండుసార్లు ఎమ్మెల్సీగా చేయడంలో తన పాత్ర ఏమిటో కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. “కవితపై మొన్నటి వరకు కేసీఆర్ బిడ్డగా గౌరవం ఉండేది.. నిన్నటి మాటలతో ఆ గౌరవాన్ని కవిత పోగొట్టుకున్నారు” అని వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *