ప్రజా సంక్షేమంపై మరింత నిబద్ధతతో ముందుకు వెళ్తాం: మానాల మోహన్ రెడ్డి
నిజామాబాద్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)
బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలిపారు.
శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మానాల మోహన్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, గోవర్ధన్, జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేసిందో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.బీఆర్ఎస్ హయాంలో దళితులకు మూడు ఎకరాల భూమి, ప్రతి ఇంటికి ఉద్యోగం వంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా నిధులు ఖర్చు చేసినప్పటికీ దాని ద్వారా ఆశించిన స్థాయిలో ప్రయోజనం పొందలేకపోయామని, ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై సమాధానం చెప్పాలని ప్రశాంత్ రెడ్డిని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు వంటి పథకాలను అమలు చేస్తున్నామని మానాల మోహన్ రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని, యువతకు ఉద్యోగాలు కల్పించామని, రైతులకు రుణమాఫీ చేశామని, సన్నధాన్యాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని పేర్కొన్నారు.అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందిస్తూ రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, నిజామాబాద్ జిల్లాకు సుమారు రూ.600 కోట్లతో మూడు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల తీసుకువచ్చామని అన్నారు.
మహిళలకు గతంలో ఇచ్చిన రుణాలపై వడ్డీ మాఫీ చేయలేదని ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మానాల మోహన్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తోందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మిగిలిన వాటిని అమలు చేసేందుకు ఇంకా సమయం ఉందని, రాబోయే రెండేళ్లలో వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేయడం మానుకుని ప్రభుత్వంతో కలిసి ప్రజా సమస్యలపై సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు.
బీఆర్ఎస్ నాయకులు తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బహిరంగ చర్చకు రావాలని మానాల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు.
రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాను అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరింత నిబద్ధతతో పనిచేస్తుందని మానాల మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జెండాగుడి చైర్మన్ లవంగ ప్రమోద్, కార్పొరేటర్ మనోహర్, మాజీ చందూర్ వైస్ ఎంపీపీ దాదాపు, కౌశిక్, శివతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

