రూ.1.50 కోట్లతో డార్మెటరీ హాల్‌కు శంకుస్థాపన
భద్రాచలం, సెప్టెంబర్ 06:(E6tv NEWS: ప్రతినిధి).
రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు.భక్తుల వసతి కోసం రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డార్మెటరీ హాల్‌కు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి దామోదర్, భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, ఉపసర్పంచ్ రత్నం కవిత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. రాబోయే గోదావరి పుష్కరాలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
భక్తుల కోసం వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. రూ.1.50 కోట్లతో నిర్మించనున్న డార్మెటరీ హాల్ అందుబాటులోకి వస్తే భక్తులకు మరింత సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు.భద్రాచలం పుణ్యక్షేత్ర అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, దేవస్థానం సమన్వయంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు బొంత రమణ, నర్రా వాణి, కారం దుర్గారావుతో పాటు పార్టీ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, రత్నం రమాకాంత్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, చింతీరాల రవికుమార్, ఎండి జిందా, మామిడి పుల్లారావు, కొప్పుల శ్రీను, ఎండి బషీర్, గండేపల్లి హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ గాడి విజయ్ తదితరులు పాల్గొన్నారు.



