Breaking News

చెస్‌లో నవభారత్ విద్యార్థుల సత్తా

అండర్‌-10లో భట్టు జైకి ప్రథమ బహుమతి.. అండర్‌-15లో లిఖిత సాయికి ఐదో స్థానం

పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి).

భద్రాద్రి కొత్తగూడెం చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి చెస్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్వంచ నవభారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. అండర్‌-10 విభాగంలో భట్టు జై ప్రథమ బహుమతి సాధించగా, అండర్‌-15 విభాగంలో భట్టు లిఖిత సాయి ఐదో స్థానంలో నిలిచి ప్రతిభ కనబరిచింది.గత నాలుగు నెలలుగా జిల్లాస్థాయి చెస్ పోటీల్లో వరుసగా రాణిస్తున్న భట్టు జై.. ఈ పోటీల్లోనూ అద్భుత ఆటతీరుతో అండర్‌-10 విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. లిఖిత సాయి సైతం పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి అండర్‌-15 విభాగంలో ఐదో స్థానాన్ని సాధించింది.

జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ సి.హెచ్. గోపికృష్ణ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జోస్న ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై ప్రవీణ్ విజేతలకు బహుమతులు అందజేశారు.విద్యార్థుల విజయాలపై వారి తల్లిదండ్రులు చందు, స్రవంతి హర్షం వ్యక్తం చేశారు. భట్టు జై రానున్న మూడేళ్లలో జాతీయస్థాయి చెస్ పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

విద్యార్థుల విజయంపై నవభారత్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయ సిబ్బంది అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్బిటర్ బిశ్వజిత్ కృష్ణ, అంబేద్కర్ ఐటీఐ ప్రిన్సిపల్ వెలన్ బాబు, కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *