36 గ్రామ పంచాయతీల సమస్యలపై ఎంపీడీవోకు బీఆర్ఎస్ వినతి
పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి).
పాల్వంచ మండలంలోని 36 గ్రామ పంచాయతీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం పాల్వంచ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచనలతో పాల్వంచ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు విశ్వనాథం, మల్లెల శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
మండలంలోని ఇల్లు లేని పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రతి ఆడబిడ్డకు రూ.2,500 ఆర్థిక సహాయం, తులం బంగారం, రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, ఆటో కార్మికులకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా మారాయని, పలు ప్రాంతాలు మురుగునీరు, చెత్తతో నిండిపోయాయని పేర్కొన్నారు. వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మడవి సరస్వతి, మాజీ వైస్ ఎంపీపీ మార్గం గురవయ్య, మాజీ ఎంపీటీసీ వీరన్న, మాజీ సర్పంచులు బిచ్చు చందు, రమేష్, ఉదయ భాస్కర్, శ్రీశైలం, నాగేశ్వరరావు, వసంతరావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


