ప్రతి విన్నపాన్ని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: ఐటీడీఏ పీవో బి. రాహుల్
భద్రాచలం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).
గిరిజన దర్బార్‌లో ఆదివాసీ గిరిజనులు సమర్పించే ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అధికారులను ఆదేశించారు.
సోమవారం భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి వినతులు, సమస్యలపై ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎస్‌డీసీ ట్రైబల్ వెల్ఫేర్ ఆనందకుమార్, గురుకులం ఆర్‌సీవో అరుణకుమారి, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఏడీఎంహెచ్‌వో సైదులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పీవో రాహుల్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు గిరిజన దర్బార్ ముఖ్యమైన వేదికగా నిలుస్తోందన్నారు. గిరిజనుల నుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, సంబంధిత శాఖలకు వెంటనే పంపించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు. తక్షణమే పరిష్కరించగల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, క్లిష్టమైన సమస్యలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ గిరిజన దర్బార్‌లో స్వీకరించిన వినతుల పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. గిరిజనులకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పలు సమస్యలపై వినతులు
గిరిజన దర్బార్‌లో పోడు భూముల సమస్యలు, ఎల్‌టీఆర్ భూముల సమస్యలు, గ్రామాలకు రహదారి సౌకర్యం, స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి కోసం శిక్షణ, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్య సహాయం తదితర అంశాలపై గిరిజనులు వినతులు సమర్పించారు.అలాగే పంట పొలాలకు నీటి సౌకర్యం కోసం విద్యుత్ కనెక్షన్లు, బోర్లు, మోటార్లు మంజూరు చేయాలని, రైతుబంధు రుణాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని పలువురు గిరిజనులు కోరారు.
దరఖాస్తులతో పాటు సమస్యలకు సంబంధించిన అవసరమైన ఆధార పత్రాలను సమర్పిస్తే పరిష్కారం మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందని పీవో తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఏపీవో పవర్ వేణు, ఏవో సున్నం రాంబాబు, పీవీటీజీ అధికారి గన్యా, ఎల్‌టీఆర్ డీటీ మణిధర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ అనసూయ, మిషన్ భగీరథ వర్క్ ఇన్‌స్పెక్టర్ వీరారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


