Breaking News

భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి

మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

రైతులు భూ పత్రాలు, హద్దులు చూపించి సహకరించాలి

పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).

భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ మండలం బోజ్యా తండా పరిధిలోని సర్వే నంబర్ 77లో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.రోవర్ పరికరాల సహాయంతో భూములను కొలుస్తున్న విధానం, క్షేత్రస్థాయిలో భూముల హద్దులను గుర్తిస్తున్న ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్న రీ-సర్వే ద్వారా భూముల వాస్తవ విస్తీర్ణం, హద్దులు, స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించి భూ రికార్డులతో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

బోజ్యా తండా పరిధిలో మొత్తం 458 ఎకరాల్లో రీ-సర్వే చేపట్టాల్సి ఉండగా, ప్రస్తుతం సర్వే నంబర్ 77లో 88 ఎకరాల్లో పనులు కొనసాగుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఇప్పటివరకు జరిగిన సర్వే పురోగతి, మిగిలిన భూముల్లో చేపట్టాల్సిన పనులు, అవసరమైన సిబ్బంది, పరికరాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.ప్రతి భూ యజమానికి సంబంధించిన భూమి హద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అందుబాటులో ఉన్న భూ రికార్డులతో సరిపోల్చాలని కలెక్టర్ ఆదేశించారు. సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రతిరోజూ నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. బోజ్యా తండాలో రీ-సర్వే పనులను మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

రైతులు సహకరించాలి

రీ-సర్వే సమయంలో భూ యజమానుల నుంచి అవసరమైన వివరాలు, రికార్డులు, పత్రాలను సేకరించి భూమి హద్దులను స్పష్టంగా గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. భవిష్యత్‌లో భూ వివాదాలకు అవకాశం లేకుండా సర్వే ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం రైతులతో కలెక్టర్ మాట్లాడి రీ-సర్వే ప్రక్రియపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతుల భూ పత్రాలను పరిశీలించారు. పట్టాదారు పాస్‌బుక్, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర భూ రికార్డులను సర్వే అధికారులకు అందజేయడంతో పాటు తమ భూముల వాస్తవ హద్దులను చూపించి సర్వేకు సహకరించాలని రైతులను కోరారు.సర్వే సమయంలో ఎదురయ్యే సమస్యలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రీ-సర్వే పూర్తయిన అనంతరం భూముల హద్దులు, విస్తీర్ణం తదితర వివరాలు మరింత స్పష్టంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.

కార్యక్రమంలో తహసీల్దార్ ధార ప్రసాద్, సర్వేయర్లు వెంకన్న, కళ్యాణ్, లైసెన్స్డ్ సర్వేయర్లు మధు, వంశీ, కవిత, జీపీఓ రాధా, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *