పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సాంకేతిక నిపుణుల బృందం రెండు రోజులుగా ప్రతిపాదిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తోంది. విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలతపై భౌగోళిక, భౌతిక, సాంకేతిక అంశాలను బృందం సమగ్రంగా అధ్యయనం చేస్తోంది.మంగళవారం ములకలపల్లి మండలం తిమ్మంపేటలో కొనసాగుతున్న పరిశీలనను జిల్లా కలెక్టర్ అంకిత్ ఏఏఐ సాంకేతిక బృందంతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలను బృంద సభ్యులు కలెక్టర్‌కు వివరించారు.
జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి సుజాతానగర్ మండలంలోని సీతంపేట, సుజాతానగర్, దుమ్ముగూడెం మండలంలోని దుమ్ముగూడెం, ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి, దమ్మపేట మండలంలోని పాల్వంచ/దమ్మపేట, చుంచుపల్లి మండలంలోని పెనగడప ప్రాంతాలను ప్రతిపాదిత స్థలాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో భూమి స్వభావం, ఎత్తుపల్లాలు, కొండలు, అటవీ ప్రాంతాలు, నీటి ప్రవాహ మార్గాలు, రహదారులు, రైల్వే మార్గాలు, విద్యుత్ లైన్లు తదితర అంశాలను ఏఏఐ బృందం పరిశీలిస్తోంది.
ఏఏఐ సభ్యులు భరత్ రెడ్డి, ఎం.డి. ఏవియేషన్ నేతృత్వంలోని సాంకేతిక బృందం ముఖ్యంగా రన్‌వే ఏర్పాటుకు అవసరమైన భూభాగం, విమానాల అప్రోచ్ మార్గం, పరిసరాల్లోని అడ్డంకులు, భూమి ప్రొఫైల్ తదితర అంశాలను అధ్యయనం చేస్తోంది. గతంలో మ్యాప్‌ల ఆధారంగా సుమారు 500 ఎకరాల విస్తీర్ణాన్ని పరిశీలించినప్పటికీ, రన్‌వే, అప్రోచ్, ఇతర అనుబంధ సౌకర్యాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనపు భూమిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని బృందం తెలిపింది.కొన్ని ప్రతిపాదిత ప్రాంతాల్లో రైల్వే మార్గం సమీపంలో ఉండటాన్ని కూడా సాంకేతిక బృందం పరిశీలించింది. సత్తుపల్లి గూడ్స్ రైల్వే లైన్ సమీపంలోని ప్రాంతాల్లో రన్‌వే దిశ, విమానాల అప్రోచ్‌పై రైల్వే మార్గం ప్రభావం, విద్యుదీకరణ వ్యవస్థ వల్ల ఏర్పడే విద్యుదయస్కాంత ప్రభావాలు వంటి అంశాలను అధ్యయనం చేస్తున్నారు.
దుమ్ముగూడెం ప్రాంతంలోనూ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన బృందం రహదారి కనెక్టివిటీ, అటవీ ప్రాంతం, భూమి ప్రొఫైల్, పరిసర అడ్డంకులను పరిశీలించింది. భవిష్యత్‌లో రహదారులు, వంతెనల అభివృద్ధి ద్వారా కనెక్టివిటీ మెరుగుపడే అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోనుంది.అదేవిధంగా ప్రతిపాదిత ప్రాంతాల్లో ఉన్న చిన్న కొండలు, మట్టి మడులు, ఎత్తైన ప్రాంతాలు, నీటి ప్రవాహ మార్గాలు, వాగులు, కాలువలు తదితర అంశాలను కూడా బృందం పరిశీలిస్తోంది. రన్‌వే కింద నీటి ప్రవాహ మార్గాలు ఉంటే ఎదురయ్యే సమస్యలు, డ్రైనేజీ ఏర్పాట్లు, అవసరమైతే రన్‌వే దిశలో మార్పులు చేసే అవకాశాలను కాంటూర్, టోపోగ్రాఫికల్ డేటా ఆధారంగా అధ్యయనం చేయనున్నారు.
భూమి స్వభావం, ముఖ్యంగా బ్లాక్ కాటన్ సాయిల్ వంటి మట్టి రకాలున్న ప్రాంతాల్లో నిర్మాణానికి సంబంధించిన భూసాంకేతిక అంశాలను పరిశీలించనున్నారు. అటవీ భూములు, ఓపెన్ ఫారెస్ట్ ప్రాంతాలు, పర్యావరణ అనుమతులు, చెట్ల తొలగింపు తదితర అంశాలపై సంబంధిత శాఖల నుంచి వివరాలను సేకరించనున్నారు.విమానాశ్రయ స్థల ఎంపికలో భూమి విస్తీర్ణంతో పాటు రన్‌వే దిశ, విమానాల అప్రోచ్ మార్గం, కొండలు, అటవీ ప్రాంతాలు, నీటి ప్రవాహ మార్గాలు, రైల్వే–రహదారి మార్గాలు, విద్యుత్ లైన్లు, గాలి వేగం–దిశ, వర్షపాతం, భూసాంకేతిక పరిస్థితులు వంటి అనేక అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఏఏఐ సాంకేతిక బృందం తెలిపింది.
క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను కాంటూర్, టోపోగ్రాఫికల్ మ్యాప్‌లు, వర్షపాతం, గాలి వేగం–దిశకు సంబంధించిన డేటాతో అనుసంధానం చేసి సాఫ్ట్వేర్ ఆధారిత విశ్లేషణ, సిమ్యులేషన్ నిర్వహించనున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, కమ్యూనికేషన్, నావిగేషన్, సివిల్ ఇంజినీరింగ్ తదితర అంశాలను విడివిడిగా పరిశీలించి సమగ్ర సాంకేతిక సాధ్యాసాధ్యాలను అంచనా వేయనున్నారు.ప్రతిపాదిత ప్రాంతాలకు సంబంధించిన రెవెన్యూ, సర్వే, అటవీ, రహదారులు, రైల్వే, భౌగోళిక, వాతావరణ తదితర వివరాలను సాంకేతిక బృందానికి అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
విమానాశ్రయ స్థల ఎంపికకు సంబంధించి పూర్తి స్థాయి సాంకేతిక అధ్యయనం, డేటా విశ్లేషణ, సిమ్యులేషన్ ప్రక్రియకు సుమారు 6 నుంచి 8 వారాల సమయం పట్టే అవకాశం ఉందని సాంకేతిక బృందం తెలిపింది. అనంతరం సమగ్ర సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించనుంది.
తుది స్థలం ఇంకా ఖరారు కాలేదు
ప్రస్తుతం జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన ప్రాథమిక సాంకేతిక అధ్యయనంలో భాగమేనని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఏ ఒక్క ప్రతిపాదిత ప్రాంతాన్ని తుది విమానాశ్రయ స్థలంగా ఎంపిక చేయలేదని తెలిపారు. ఏఏఐ సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదిక, సంబంధిత శాఖల అనుమతులు, భౌగోళిక–పర్యావరణ అంశాలు, భవిష్యత్ కనెక్టివిటీ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం మాత్రమే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
ఈ పరిశీలనలో కొత్తగూడెం ఆర్డీవో మధు, సీపీఓ సునీత, ములకలపల్లి తహసీల్దార్ స్వాతి బిందు, ఆర్అండ్బీ అధికారి నాగేశ్వరరావు, సర్వే అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



