నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రాత్మకం
పీడిత ప్రజల విముక్తికి ఐక్య పోరాటాలు అవసరం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా
కొత్తగూడెం, సెప్టెంబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి)
వీరనారి చాకలి ఐలమ్మ సాగించిన అసమాన పోరాటస్ఫూర్తి చిరస్మరణీయమని, నేటి తరానికి ఆమె ఆదర్శప్రాయురాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు. చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో గురువారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. నాటి భూస్వామ్య పెత్తందారీ దోపిడీకి, విసునూరు దేశ్ముఖ్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎర్రజెండా అండతో ధైర్యంగా ఎదురొడ్డి నిలిచిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తన పంటను కాపాడుకునేందుకు ఆమె చేసిన తిరుగుబాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి గొప్ప దిక్సూచిగా మారిందన్నారు.
చాకలి ఐలమ్మతో పాటు నాటి యోధులు సాగించిన మహత్తర పోరాటం వెట్టిచాకిరీ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిందని, పీడిత ప్రజల విముక్తికి బాటలు వేసిందని గుర్తుచేశారు. దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు.
నేటికీ పేదలకు సంపూర్ణంగా భూమి, ఆవాసం అందకపోవడం దుర్మార్గమని అన్నారు. పీడిత ప్రజలు ఐక్యంగా పోరాడితేనే తమ హక్కులను సాధించుకోగలరని పేర్కొన్నారు. ఐలమ్మ పోరాటస్ఫూర్తితో భూ సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో రాజీలేని ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమాల్లో ఇంద్రాల మురళి, రాచర్ల వెంకటయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

