కొత్తగూడెం, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి).
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ఆమె చిత్రపటానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట పటిమ తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. సామాజిక అన్యాయం, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.
భూమి, భుక్తి, విముక్తి కోసం నాటి నిరంకుశ పాలనను ఎదిరించి నిలిచిన ఐలమ్మ.. అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన మహనీయురాలని కొనియాడారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవాన్ని మరింత బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ సేవలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆమె త్యాగాలను స్మరించుకుంటూ సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు, కార్పొరేటర్లు, వివిధ సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

