Breaking News

అటవీ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం

అటవీ సంపదతో పాటు గిరిజనుల హక్కుల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలి

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అటవీ నేరాల నియంత్రణ

కొత్తగూడెం,సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి)

విధి నిర్వహణలో అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సేవలు, త్యాగాలు స్ఫూర్తిదాయకమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కొత్తగూడెం ఇల్లందు క్రాస్‌రోడ్స్‌లోని చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ సభకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు చలమల శ్రీనివాసరావు విగ్రహానికి కలెక్టర్ అంకిత్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.కలెక్టర్ మాట్లాడుతూ అటవీ సంపదను కాపాడే క్రమంలో దేశవ్యాప్తంగా ఎంతోమంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి త్యాగాలను స్మరించుకోవడం, వారి సేవలను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది అటవీ సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ, భద్రతా పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని సూచించారు. మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా అటవీ నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని అన్నారు. శాస్త్రీయ పద్ధతులు, ఆధునిక పరికరాలు, కమ్యూనికేషన్, లైటింగ్ వంటి సదుపాయాలతో పాటు సిబ్బందికి నిరంతర శిక్షణ అందించాలని సూచించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారమైన అటవీ ప్రాంతం ఉందని, కోయలు, కొండరెడ్లు తదితర గిరిజన సమాజాలకు అడవులతో ఎంతోకాలంగా సన్నిహిత సంబంధం ఉందని కలెక్టర్ తెలిపారు. అటవీ సంపదను పరిరక్షించడంతో పాటు గిరిజనుల హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. అటవీ శాఖ, గిరిజన సమాజాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం పెంపొందించాలని సూచించారు.

అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, అటవీ హక్కులపై అధికారులు, సిబ్బంది, గిరిజనుల భాగస్వామ్యంతో అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అటవీ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని అటవీ సంపదను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం, సమాజం అండగా నిలవాలని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, అటవీ శాఖ అధికారులు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *