అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్
కొత్తగూడెం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి)
భూ రీ సర్వే పనులను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొత్తగూడెం మండలం చిట్టిరామవరం తండాలో జరుగుతున్న డిజిటల్ భూ రీ సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల వినియోగం, భూముల కొలతలు, వివరాల నమోదు ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల పురోగతిని సమీక్షించి, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.అనంతరం రైతులతో మాట్లాడిన అదనపు కలెక్టర్.. రీ సర్వేకు సంబంధించిన సందేహాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ యజమానులు తమ భూములకు సంబంధించిన వివరాలను అధికారులకు అందించి సహకరించాలని కోరారు. డిజిటల్ రీ సర్వే ద్వారా భూముల వివరాలు కచ్చితంగా నమోదై భవిష్యత్‌లో భూ వివాదాలు, సమస్యలు తగ్గే అవకాశం ఉందన్నారు.
క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పుల్లయ్య, కార్పొరేటర్ డాక్టర్ స్వప్న, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

