Breaking News

భీంగల్ కొత్త బస్టాండ్‌లో కంట్రోలర్ లేక ప్రయాణికుల ఇబ్బందులు

బస్సుల రాకపోకలు ఎక్కువగా ఉన్నా పట్టించుకోని ఆర్టీసీ అధికారులు

సమయాలు తెలియక ప్రయాణికుల అవస్థలు

భీంగల్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి)

భీంగల్ పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో కంట్రోలర్‌ను ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌లో రోజూ పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, బస్సుల సమయాలు, రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు కంట్రోలర్ అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు.

భీంగల్ కొత్త బస్టాండ్ నుంచి వేల్పూర్, భీంగల్ ప్రాంతాల మీదుగా రోజంతా సుమారు 25 ట్రిప్పులు, చెంగల్–భీంగల్ మార్గంలో సుమారు 25 ట్రిప్పులు, నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్ బస్సులు మరో 8 ట్రిప్పులు నడుస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అదేవిధంగా నిజామాబాద్ నుంచి భీంగల్‌కు డిపో బస్సులు కూడా పలు ట్రిప్పులు నడుస్తున్నాయని తెలిపారు. కామారెడ్డి ప్రాంతం నుంచి కూడా రెండు బస్సులు నడుస్తున్నాయని పేర్కొన్నారు.ఇంత పెద్ద సంఖ్యలో బస్సులు నడుస్తున్నప్పటికీ కొత్త బస్టాండ్‌లో కంట్రోలర్‌ను ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కంట్రోలర్‌ను ఏర్పాటు చేయాలని ఆర్మూర్ డిపో మేనేజర్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. కంట్రోలర్‌ను ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా అమలు కాలేదని చెబుతున్నారు.

బస్సుల రాకపోకల సమయాలు తెలియక ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు అవసరమైన కనీస సౌకర్యాలతో పాటు బస్సుల సమయాలపై స్పష్టమైన సమాచారం అందించాలని కోరుతున్నారు.

అదేవిధంగా ప్రైవేటు వాహనాల విషయంలోనూ ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రైవేటు వాహనాల కారణంగా ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, దీనిపై అధికారుల దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటు వాహనాలతో ఆర్టీసీ సిబ్బందికి ఏమైనా సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.

భీంగల్ కొత్త బస్టాండ్‌లో వెంటనే కంట్రోలర్‌ను ఏర్పాటు చేసి, బస్సుల రాకపోకల సమయాలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని స్థానికులు ఆర్మూర్ డిపో మేనేజర్, ఆర్టీసీ ఆర్‌ఎంలను కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *